
ఆరేళ్లకే నిండిన నూరేళ్లు
రాజాం సిటీ: అప్పటి వరకు సరదాగా చిట్టిపొట్టి మాటలు ఆడుతూ తల్లిదండ్రులతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. దసరా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించిన ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా అంటూ పెట్టిన తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కళ్లెదుటే మృతిచెందడంతో జీర్ణించుకోలేక గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదించారు.
ఈ హృదయ విదారక ఘటన రాజాంలో మంగళవారం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన లుకలాపు మోహనరావు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య ఇందు, కుమార్తె ద్రాక్షాయణి(6)తో కలిసి ద్విచక్రవాహనంపై బొద్దాం నుంచి రాజాం వస్తున్నారు. అదే సమయంలో బొబ్బిలి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బొబ్బిలి జంక్షన్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. రెండో వైపు పడిపోయిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే తేరుకుని కుమార్తెను చూసి ఒక్కసారిగా భోరున విలపించారు.
తన కుమార్తెకు ఏమీ కాదని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి చిన్నారిని మోసుకుంటూ తండ్రి తీసుకువెళ్లిన దృశ్యం చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు. చిన్నారి మృతితో బూరాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై రమణమూర్తి తెలిపారు.