
కూటమి పాలనలో అరాచకాలు, అవినీతి దాడులు
● బాధితుల కోసమే డిజిటల్ బుక్
● డిజిటల్ బుక్ పోస్టర్లు విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎంపీ
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం పదహారు నెలల పరిపాలనలో అక్రమాలు, అవినీతి, అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఇంకేం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్‌లు అన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ యాప్‌కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు నెలల్లో పరిపాలన విషయంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం తమకు ఓట్లు వేసిన ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కూటమి ప్రభుత్వం విఫలమైన తీరును, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి సోషల్ మీడియా తీసుకువెళ్తున్న తీరును జీర్ణించుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అందుకనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ డిజిటల్ బుక్ యాప్‌లో తమ కష్టాలు, వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అసలైన సైకో బాలకృష్ణ
అసలు సిసలైన సైకో, ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పొందిన బాలకృష్ణ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సైకో అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు పోలీస్ వ్యవస్థ కూడా వంతపాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు, మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.