
ఆపద్బాంధవులు
పార్వతీపురం రూరల్/రాజాం సిటీ: మనిషి ప్రాణానికి ప్రత్యామ్నాయం లేదు. అలాగే మనిషి రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు! ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా, ప్రయోగశాలల్లో రక్తాన్ని సృష్టించలేని పరిస్థితి. అందుకే, ఒకరి ప్రాణాన్ని కాపాడాలంటే మరొకరు అందించే రక్తమే ఏకై క ఆధారం. ఆపదలో ఉన్నవారికి ప్రాణభిక్ష పెట్టే ఆ మహత్తర కార్యానికి గుర్తుగా, ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 1వ తేదీన ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ జరుపుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 1682 మంది స్వచ్ఛంద ప్రత్యక్ష రక్తదాతలు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారిని గుర్తు చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకునే ప్రత్యేక రోజు కేవలం ఒక దినోత్సవం కాదు, మానవత్వం పరిమళించే ఒక మహాయజ్ఞం.
ప్రాణం నిలిపే అమృతధార
ప్రతిరోజూ మన దేశంలో వేలాది మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రసవ సమయంలో తల్లీబిడ్డలు రక్తహీనతతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. తలసేమియా, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులు, రోగులకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో, దాతలు అందించే ప్రతి రక్తపు చుక్క ఓ అమృతధారలా మారి ప్రాణాలను నిలుపుతుంది. మన దేశంలో ఏటా సుమారు 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, స్వచ్ఛంద దాతల ద్వారా కేవలం 90 లక్షల యూనిట్లు మాత్రమే అందుతోందని రక్త దాతలు, వైద్యులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
అపోహల తెరలను చీల్చుదాం
రక్తదానం అనగానే చాలామందిలో అపోహలు, అనవసర భయాలు గూడుకట్టుకుని ఉంటాయి. ‘రక్తదానం చేస్తే నీరసించిపోతాం, అనారోగ్యం పాలవుతాం’ వంటివి కేవలం నిరాధారమైన ప్రచారాలు మాత్రమే. వాస్తవాలను పరిశీలిస్తే..
రక్తం ఇస్తే నీరసం వస్తుందా?
మన శరీరంలో సగటున 5–6 లీటర్ల రక్తం ఉంటుంది. దానం చేసేది కేవలం 350 మిల్లీలీటర్లు మాత్రమే. ఈ కొద్దిపాటి రక్తాన్ని మన శరీరం కేవలం 24 నుంచి 48 గంటల్లోనే తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. ఎలాంటి నీరసం రాదు.
రక్తదానం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయా?
రక్త సేకరణ ప్రక్రియ అత్యంత సురక్షితమైనది. ప్రతి దాతకు కొత్త, స్టెరిలైజ్డ్ సూదిని మాత్రమే ఉపయోగిస్తారు. దీనివల్ల దాతకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకే అవకాశమే లేదు.
దాతలే హీరోలు..
రక్తదానం చేయడానికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. మానవత్వంతో స్పందించే ప్రతి ఒక్కరూ రక్తదాత కావచ్చు. వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. బరువు కనీసం 50 కిలోగ్రాములు ఉండాలి. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, అంటువ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12.5 గ్రాములు ఉండాలి. పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి, మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.
ప్రాణదానానికి మొదటి బాట
రక్తదానంపై అపోహలను నమ్మవద్దు ఆధునిక వైద్య విధానంలో రక్తదానం 100శాతం సురక్షితం. ప్రతి దాత భద్రతను నిర్ధారించుకున్నాకే రక్తాన్ని స్వీకరిస్తాం. 18 ఏళ్లు వయసు దాటిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. నిజానికి, క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల శరీరంలో అధిక ఐరన్ నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత రక్తకణాల స్థానంలో కొత్తవి ఏర్పడి, శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలి. – డాక్టర్. జి.నాగభూషణరావు,
డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం మన్యం జిల్లా
శతక దానానికి ఒక్క అడుగు దూరం
మన ఇంట్లో వారికి రక్తం అవసరమైతే ఎంత ఆరాటపడతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బ్లడ్ బ్యాంకులో మనకు తెలియని వారెందరో అదే ఆరాటంతో ఎదురుచూస్తున్నారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నది ఎవరో కాదు. మన లాంటి మనుషులే. ఇప్పటికి స్వచ్ఛందంగా ప్రత్యక్ష రక్త దాతగా దైర్యంగా 99 సార్లు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాను. యువత ముఖ్యంగా రక్తదానానికి ముందుకురావాలి. పుట్టినరోజున రక్తదానం చేసి ఆ రోజును మరపురానిదిగా చేసుకునే మంచి ఆలోచనలు యువతలో రావాలి.
– బోటు రామకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, పార్వతీపురం
ప్రాణాలు నిలబెడుతున్న రక్తదాతలు
పార్వతీపురం మన్యం జిల్లాలో 1682 మంది స్వచ్ఛంద రక్తదానం
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

ఆపద్బాంధవులు

ఆపద్బాంధవులు

ఆపద్బాంధవులు