
చట్టాలపై అవగాహనతోనే గిరిజనుల సంక్షేమం
● విజయనగరం జిల్లా ప్రధాన
న్యాయమూర్తి ఎం బబిత
పార్వతీపురం రూరల్: భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే వారి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఉద్ఘాటించారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మండలంలోని చినమరికి గ్రామంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం ఎన్నో ప్రణాళికలు, చట్టాలు దేశంలో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాల్య వివాహాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18ఏళ్ల వయస్సు దాటాకే వారు శారీరకంగా, మానసికంగా పరిణతి చెందుతారన్నారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ క్రమంలో తక్కువ బరువుతో పిల్లల పుట్టడం, నవజాత శిశు మరణాలు, పోషకాహార లోపాలు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు.
అడవి, భూమిని కాపాడుకోవాలి
ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు మాట్లాడుతూ గిరిజనుల జీవనానికి, సంస్కృతికి ఆధారమైన అడవి, భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కల్పించిన హక్కులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. తమ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, పార్వతీపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోష్పిన్, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి, తహసీల్దార్ సురేష్, లోక్ అదాలత్ సభ్యులు జోగారావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వెంకటరావు, స్థానిక సర్పంచ్ గంగ తదితరులు పాల్గొన్నారు.