
ఇచ్చిన మాటను చంద్రబాబు, లోకేష్ నిలబెట్టుకోవాలి
● ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు
గజపతినగరం: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్ కాలువ నుంచి విజయనగరంలోని వెదురు వాడ తాటిపూడి ఎక్స్‌టెన్షన్ బాలెన్స్ రిజర్వాయర్ తరువాత ఎక్కడా బాలెన్సింగ్ రిజర్వాయర్ లేదని దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లాకార్యదర్శి బి.రాంబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు బొండపల్లి సభలోను, అలాగే నారాలోకేష్ గంట్యాడ మండలంలో జరిగిన సభలోను ఎలైన్ మెంట్ పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గం పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికీ ఇచ్చిన ఆ మాటను తండ్రీకొడుకులు నిలబెట్టు కోలేదన్నారు. గుమడాం గ్రామం నుంచి కోటగండ్రేడు వరకు కాలువ లోలెవెల్లో తీసుకుని పోయి అక్కడి నుంచి ఐదు లిఫ్ట్‌ల ద్వారా నీరు పంప్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జిల్లాలోని మెట్టప్రాంతాలకు సాగునీరందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎడమ కాలువ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ చల్లా జగన్, గంట్యాడ మండలం పోరాట కమిటీ కన్వీనర్ కోడెల శ్రీను, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపు నాయుడు, రైతు సంఘం నాయకులు డుదేవర జగన్, దాసరి సింహాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు రాకోటి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.