
యాదొచ్చిందేటి..!
ఏడాదిన్నరకు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జరిగితే జల్లెడతో నీళ్లు మొయ్యడం అంటే బాబుదేరా.. మొత్తానికి ఆయనకు అలా నడిచిపోతాంది.. ఎల్లప్పుడూ ఎలచ్చన్లప్పుడు వచ్చి ఏదైనా చెప్తారు.. చేయాలంటే ఎనకాముందూ చూడాలి కానీ బొంకులు చెప్పడానికి నోటికి అడ్డేటుంది చెప్మీ... ఏదేదో చెప్పినారు.. గెలిచినారు.. మళ్లీ ఏడాదిన్నరకు వస్తున్నారు.. చెప్పినవాటిల్లో ఒక్కటైనా నాడింగా ఇచ్చినారా.. ఈ లిస్ట్ చూసి టిక్కులు పెట్టుమీ.. తేలిపోద్ది.. ఇదీ గజపతినగరం బస్టాండ్లో అప్పలనాయుడు చిరాకు. ఒరే అప్పలనాయుడు దసరాపండగ ముందురోజు చంద్రబాబు మనూరు రావడం గొప్పేరా అన్నాడు పైడిరాజు. ఎందుకురా.. ఎందుకు గొప్ప.. ఎవడికి గొప్ప.. వచ్చినందుకు ఏమైనా చేస్తే గొప్పగానీ కోట్లు తగలేసి వచ్చి.. అలా ఫొటోలకు ఫోజులిచ్చి పెన్షన్లు పంచుకుని వీడియోలు దిగి వెళ్తే ఎవడికిరా గొప్ప అన్నాడు చిరాగ్గా అప్పలనాయుడు. అది కాదురా అప్పిగా.. ఏదైనా సీఎం మనూరు రావడం గొప్పేకదా అన్నాడు పైడిరాజు. ఒరేయ్ ఏదైనా తెస్తే గొప్పగానే.. ఉత్త చేతుల్తో వస్తే ఎవడికిరా గొప్ప అన్నాడు అప్పలనాయుడు.. అయితే ఏటీ ఇవ్వలేదంటావా అన్నాడు పైడి రాజు..
ఏదిరా ఇటు రమ్మిరా.. టెంకిమీద ఒకటిచ్చేయగలను అంటూ ఎలచ్చన్లలో ఇచ్చిన హామీల లిస్ట్ చదివాడు అప్పలనాయుడు.. నోటికొచ్చింది చెప్పడమే తప్ప ఏనాడైనా అవి ఇచ్చామా లేదా అని చూసుకున్నారా.. కిరాణా సామాన్లు తెచ్చినప్పుడు లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అనేవి చూసుకుంటామా.. అలాగే మనం ఇచ్చిన హామీలన్నీ చేసినామా లేదా చూసుకోవాలి కదా..
● వీటికి సమాధానం ఇవ్వు...
50 ఏళ్లు దాటిన బడుగుబలహీన వర్గాలవారందరికీ కొత్త పెన్షన్లు అన్నాడు.. ఉన్నవాళ్లలో వేలాది మందివి వెరిఫికేషన్ అని లేపేసినాడు.. కొత్తవి ఇవ్వవయ్యా అంటే ఉన్నవి తీసేశాడు. తల్లికి వందనం.. అదొక మహా విచిత్రంగా ఉంది.. ఎవరికి ఇస్తారో.. ఎంత ఇస్తారో.. ఎవరికి ఎందుకు ఎగ్గొడతారో తెలీదు.. ఆడబిడ్డ నిధి కింద మన ఆడవాళ్లకు నెలకు రూ.1500 అన్నారు.. ఇచ్చార్రా.. అవునురా పైడిగా యూరియా కూడా ఇవ్వలేని గవర్నమెంట్‌ను మాత్రం నేను తొలిసారి చూస్తున్నానురా. ఇంత దరిద్రం నా డైబ్భెయేళ్ల జీవితంలో చూడలేదురా.. చెప్పులు.. సంచులు లైన్లో పెట్టుకుని యూరియా కోసం దెబ్బలాడుకోవడం.. అదొక పెద్ద ప్రహసనంరా బాబూ.. అప్పలనాయుడు.. పల్లకోరా అన్నాడు.. పైడిరాజు..
ఏట్రా పల్లకోవడం.. మెడికల్ కాలేజీలు తెచ్చిందిలేదు కానీ.. జగన్ తెచ్చిన పార్వతీపురం కాలేజీని ప్రైవేటుకు అమ్మేస్తున్నాడట.. అక్కడ చివరిదశలో నిర్మాణంలో ఉన్న కురుపాంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీని ఇప్పటికీ అందుబాటులోకి తేలేదురా.. ఇక మన గుంటలకు నిరుద్యోగ భృతి అన్నాడు.. ఓలమ్మ నిబ్బగే గావాల అనుకున్నా.. చూస్తున్నావు కదా.. వట్టిదే అని తేలిపోయింది.. మన జిల్లా గిరిజనులు డోలీ కష్టాలు చూస్తున్నాం కదరా.. ఏమైనా పరిష్కారం చూపారా అంటే ఏం లేదురా.. ఆయన దయవల్ల మనకు నిరంతరం సేవలందించే వలంటీర్లందరి ఉద్యోగాలు పోనాయిరా... బియ్యం బండీ ఆగిపోయిందరా.. ఉద్యోగాలు ఇవ్వడంపోయి చిరుద్యోగులను తొలగించేస్తున్నార్రా.. ఆళ్లంతా ఉసూరుమంటున్నారు.. ఔరా.. పల్లె పండగ అన్నాడు.. రోడ్లు అద్దంలా మెరుస్తాయి అన్నాడు.. ఏదీ ఓసారి నా బండి ఎక్కుమీ అలా బొబ్బిలి కాసి వెల్డుము గానీ అన్నాడు. నాయుడు.. వద్దురా నాయిన.. నడుం జారిపోద్ది.. పండక్కి కుక్కి మంచమే దిక్కయిపోద్ది అన్నాడు పైడి రాజు.. చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్.. చంద్రబాబు ఎప్పుడూ మాటలు చెబుతాడు.. పని చేయడు.. ఇలాంటి షూటింగ్‌లు మాత్రం బాగా చేస్తాడురోయ్.. అంటూ అప్పలనాయుడు బయల్దేరాడు.. నీకు దండంరా బాబు.. నిన్ను ఒప్పించలేం అంటూ పైడి రాజు జారుకున్నాడు.