
మత్స్యకారులకు నష్టం జరిగే చర్యలు విరమించుకోవాలి
విజయనగరం: మత్స్యకారులకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట గ్రామం నక్కపల్లి మండలం బల్క్ డ్రగ్స్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక మత్స్యకారులు 15రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమను మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేస్తే మత్స్యకారుల జీవనానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన వారిపై తప్పుడు కేసులు పెడితే మత్స్యకారులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు అండగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వం దుష్ట చర్యలకు పాల్పడకుండా తక్షణమే తీరప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆలోచన విరమించుకోవడంతో పాటు మత్స్యకారులపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.