
సీఎం పర్యటనకు 600 మందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి వస్తున్న సంగతి విదితమే. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు మంత్రి కొండపల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిలు మంగళవారం పింఛన్లు పంపిణీ చేసే సభా ప్రాంగణాన్ని ఎస్పీ దామోదర్ ,ఏఎస్పీ సౌమ్యలతలతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్ల రూట్ మ్యాప్‌లను దగ్గరుండి మంత్రులకు ఎస్పీ దామోదర్ చూపించారు. దాదాపు 600 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా వివరించారు. సభా స్థలం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగ్ స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ వెళ్లే మార్గాలను క్షేత్ర స్థాయిలో ఎస్పీ దామోదర్ పర్యవేక్షించారు. బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించే విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.