
సమగ్ర శిక్షలో ఆకలి కేకలు
● రెండు నెలలుగా అందని వేతనం
● ఆర్థిక ఇబ్బందుల్లో 1238 మంది ఉద్యోగులు
● పట్టించుకోని కూటమి పాలకులు
విజయనగరం అర్బన్/రాజాం: సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో ఎస్‌ఎస్‌ఏలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1,238 మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో సీఆర్‌ఎంటీలు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, ఫిజియోథెరిపిస్టులు, సైట్ ఇంజినీర్లు, మెసెంజర్లు, డ్రైవర్లుగా పనిచేస్తున్నా వేతనం సకాలంలో అందజేయకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి వర్తింపజేయపోవడంతో కూటమి తీరుపై భగ్గుమంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిరవధిక సమ్మె చేసిన సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ సిబ్బందికి మద్దతు తెలుపుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని ట్విట్టర్‌లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా హామీ అమలుచేయలేదని నిట్టూర్చుతున్నారు.
విధులు ఇలా..
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో సమగ్ర శిక్షలో 1,238 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఎమ్మార్సీ సిబ్బంది 130 మంది, సీఆర్‌ఎంటీఎస్‌లు 151, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్స్ 259 మంది, కేజీబీవీలో పీజీటీలు 105, పీఈటీలు 26, ప్రిన్సిపాల్స్ 26, సీఆర్‌టీఎస్ 179, ఏఎన్‌ఎంలు 19, అకౌంటెంట్స్ 26 మంది, ఇన్‌స్ట్రక్టర్స్ 31, కేజీబీవీల్లో కుక్స్–80, ఇతర సిబ్బంది 138, ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నిర్వహణ సిబ్బంది 58 మంది ఉన్నారు.
పండగ పూట అప్పులు
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత లేదు. పని సమయాలు మాత్రం అధికంగా ఉన్నాయి. సకాలంలో జీతాలు లేవు. కచ్ఛితమైన జాబ్ చార్ట్ లేదు. ఈ విషయాలపై మార్గదర్శకాలు జారీచేయాలి, రెండు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. జీతాలు లేక అప్పులు చేస్తున్నాం. పండగపూట పస్తులు ఉండాల్సి వస్తుంది.
– బోర గోవిందరావు, సమగ్ర శిక్ష ఉద్యోగి, రాజాం
సమ్మెకు సిద్ధంగా ఉన్నాం
గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్‌ను అధికారంలోకి వస్తే అమలుచేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు కనిపించలేదు. అక్టోబర్ 12లోగా మా సమస్యలు పరిష్కరించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వాలి. లేకుంటే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మె నిర్ణయం తీసుకుంటాం.
– నిమ్మక విజయకుమార్, సమగ్రశిక్ష ఉద్యోగి, రాజాం

సమగ్ర శిక్షలో ఆకలి కేకలు

సమగ్ర శిక్షలో ఆకలి కేకలు

సమగ్ర శిక్షలో ఆకలి కేకలు