
పత్రానికో రూటు.. సంతకానికో రేటు!
రాజాం:
రాజాం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పత్రానికో రూటు, రేటు ఉంటుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇక్కడకు వస్తే ముందుగా రైటర్లను సంప్రదించాలి. వీరి ధర వీరికి చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక కొర్రీ అక్కడి అధికారులు నుంచి వస్తుంది. ఆ కొర్రీ నుంచి తప్పించుకుని రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ సబ్‌రిజిస్టార్‌తో సంబంధంలేని ఓ వ్యక్తి రంగంలోకి దిగి ధర నిర్ధారిస్తారు. ఆ పత్రాల ఆధారంగా రేటు నిర్ణయిస్తాడు. ఆ మేరకు అదనపు చెల్లింపులు జరిపితే పనవుతుంది. లేదంటే రిజిస్ట్రేషన్‌కు కొర్రీలు తప్పవు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతల అండదండలు తమకు ఉన్నాయంటూ కార్యాలయంలో ఉన్నవారు హూంకరించడం పరిపాటిగా మారిపోయిందంటూ పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
సంతకం లెక్కన డబ్బుల వసూలు..
ఇక్కడ రైతు వారి పొలాలు దగ్గర నుంచి ఇంటి స్థలాలు, గ్రామ కంఠాలు, జిరాయితీ భూమి.. ఇలా ఏదైనా సరే ఆయా ధ్రువీకరణ పత్రాల్లోని సంతకాలు, సాక్షుల సంతకాలు ఆధారంగా రేటు నిర్ధారిస్తారు. గ్రామ కంఠాల్లోని ధ్రువీకరణ పత్రాలు ఆధారంగా రిజిస్ట్రేషన్లు కావాలంటే అందులో వీఆర్వో ఽధ్రువీకరణ పత్రం ఉంటే రూ.10 వేలు, తహసీల్దార్ ధ్రువీకరణ సంతకం ఉంటే రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చలానా కంటే అదనంగా చెల్లించాలి. ఇవి రైటర్‌తో సంబంధంలేనివి. రైటర్ వద్ద వీటికి మరో ప్రత్యేక ధర ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్లకు సాక్షులు వారే సిద్ధం చేస్తే ఒక ధర, లబ్ధిదారులు ఎవరినైనా తీసుకొస్తే ఇంకో ధర ఉంటుంది. ఇవి కాకుండా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తే ఒక ధర, రైటర్లే సిద్ధంచేస్తే వేరే ధర ఉంటుంది. వీటికి భయపడి నిజమైన హక్కుదారులు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
‘సంతకవిటి మండలంలో ఓ గ్రామానికి చెందిన స్థలం కోర్టు వివాదంలో ఉండగానే రాజాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ మార్టుగేజ్ రిజిస్ట్రేషన్‌కు రాజాంలోని ఓ పైవేట్ ఫైనాన్స్ కంపెనీ రూ.6 లక్షల రుణం ఇచ్చింది. ఇదెలా సాధ్యమైందని ఆరాతీస్తే రాజాం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రైటర్లు, కార్యాలయం ఉద్యోగుల ప్రమేయంతో తప్పుడు సర్వే నంబర్‌తో పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేశారు. అక్రమపద్ధతిలో రుణం పొందేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాల కోసం లబ్ధిదారుడు ఎక్కువ మొత్తం ముట్టజెప్పినట్టు తెలిసింది.’
సబ్ రిజిస్ట్రార్ ఏమన్నారంటే..
ఇక్కడ గతంలో ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. మేం వచ్చిన తరువాత వాటిని నిలువరిస్తున్నాం. పొజిషన్ సర్టిఫికెట్ల విషయంలో వీఆర్‌ఓలు, తహసీల్దార్లు ఇక్కడకు రావాల్సి ఉంటుంది. అలా లేని సమయంలో ప్రత్యామ్నాయంగా ధ్రువీకరణ పత్రాలపై ఎంకై ్వరీ చేస్తున్నాం. తప్పుడు సర్వే నంబర్లను గుర్తించలేకపోతున్నాం. ఎవరి వద్దా మేం నేరుగా డబ్బులు వసూలు చేయడం అనే ప్రసక్తిలేదు. గిట్టనివారు మాపై ప్రచారం చేస్తున్నారు.
– కె.వేణు, సబ్‌రిజిస్ట్రార్, రాజాం
షరా‘మామ్మూళ్లే’..
గత కొంతకాలంగా రాజాం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సాగుతున్న అడ్డగోలు మామ్మూళ్ల వ్యవహారాలు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తున్నాయి. రైటర్ల నుంచి కార్యాలయంలోని ప్రధాన ఉద్యోగి, సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరిపైనా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు విచ్చలవిడిగా రాజాంలో ఏర్పడి రుణాలు ఇస్తుండడంతో ఇంటి స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌కు డిమాండ్ పెరిగింది. లేని ఆస్తి, ఇళ్లు ఉన్నట్లు, కొత్త సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వీటికి రూ.15 వేలు నుంచి రూ.25వేలు వరకు అనధికార వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించి, అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు అక్రమ వసూళ్లు నిలువరించాలని పలువురు కోరుతున్నారు.
రాజాం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా
పైవేట్ ఫైనాన్స్‌లు, ఆస్తి హక్కుల కోసం అక్రమ రిజిస్ట్రేషన్లు!
పుట్టుకొస్తున్న తప్పుడు సర్వేనంబర్ పత్రాలు

పత్రానికో రూటు.. సంతకానికో రేటు!