
దత్తత తీసుకోవడం సామాజిక బాధ్యత
విజయనగరం అర్బన్: బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ఉద్యోగులకు స్వచ్ఛందమేనని, ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అదొక సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర మండల, డివిజన్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సమావేశంలో పీ–4, సీజనల్ వ్యాధు లు, వ్యవసాయం, పెన్షన్ల పంపిణీపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే 67,066 బంగారు కుటుంబాలను గుర్తించామని, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి, వారి వాస్తవ అవసరాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం నాటికి ఈ జాబితాను అందజేయాలని స్పష్టంచేశారు. దానికి అనుగుణంగా మార్గదర్శకులను గుర్తించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కాలువల్లో తాగునీటి వైపులైన్లు లేకుండా చూడాలని ఆదేశించారు. సాధారణ యూరియా కు బదులుగా నానో యూరి యా వినియోగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో నానో యూరియా 12,000 బాటిళ్లు అందుబాటుల్లో ఉన్నట్టు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చాంబర్ నుంచి జేసీ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రామన్, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు.