
జిల్లాకు జ్వరమొచ్చింది..!
విజయనగరం ఫోర్ట్: జిల్లావ్యాప్తంగా అనేక మంది జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాధులను అదుపు చేయాలంటే సకాలంలో వాటిని గుర్తించగలగాలి. డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. జ్వరపీడితులను త్వరగా గుర్తించాలంటే ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలి. కాని కూటమి ప్రభుత్వంలో పీవర్స్ సర్వే ఎక్కడా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరపీడితులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్పత్రులకు వెళ్తున్న జ్వరపీడితులు
రెండు, మూడు రోజుల పాటు జ్వరం ఉన్నవారు ఏజ్వరమో తెలుసుకోవడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా మరి కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల్లో టైపాయిడ్, మలేరియా, డెంగీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంతమంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచానపడి మూలుగుతున్నారు.
గత ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వే
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటా ఫీవర్ సర్వేను ముందుగానే చేపట్టేవారు. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు సర్వే చేసేవారు. వారికి వలంటీర్లు కూడా సహాయం చేసేవారు. ఇంటిలో ఎవరికై నా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయా అని రెండు మూడు విడతలుగా సర్వే చేసేవారు. దీని వల్ల జ్వరపీడితులందరినీ గుర్తించి చికిత్స అందించడానికి వీలుండేది. మలేరియా, డెంగీ వంటి లక్షణాలుంటే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించి, నిర్ధారణ చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేవారు.
జిల్లాలో ఆచూకీ లేని సర్వే
గతంలో మాదిరి నేడు జిల్లాలో ఎక్కడా ఫీవర్ సర్వే జరగడం లేదని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ బాధితులను గుర్తించి సేవలు అందడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెండు లక్షలకు పైగా జనం జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం అధికంగా జ్వరపీడితులు చేరి చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఓపీలో చికిత్స తీసుకుంటుండగా, మరి కొంతమంది ఇన్‌పేషేంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు.
మంచాన పడిన జనం
ఎక్కడా కానరాని ఫీవర్ సర్వే
పట్టించుకోని అధికారులు
ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు సింహాచలం. ఈమెది మెంటాడ మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి జీడికవలస. జ్వరంతో మూడు రోజులుగా మంచంపైన ఉంటోంది. ఈమెతో పాటు మరి కొంత మంది లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని ఏడు గిరిజన గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
జ్వరాల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు
జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టాం. అవసరమైతే మరోసారి సర్వే చేయిస్తాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.
డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

జిల్లాకు జ్వరమొచ్చింది..!