
దోపిడీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
● ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్‌కు తరలింపు
● పరారీలో మరొక నిందితుడు
● పట్టుబడిన నిందితుడిపై మరో ఎనిమిది కేసులు
విజయనగరం: నగరంలోని చెల్లూరు – గొట్లాం వద్ద ఈ నెల 19న జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి విజయనగరం రూరల్ పోలీసులు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు.. సాహుగర్ సంతోష్‌కుమార్ అనే వ్యక్తి సరుగుడు కర్రల లోడ్‌తో విశాఖ నుంచి రాయగడ వైపు లారీలో వెళ్తుండగా.. ఐదుగురు నిందితులు చెల్లూరు రోడ్డులో గల భాను దాబా వద్ద లారీని అడ్డగించి సంతోష్‌కుమార్‌పై దాడి చేశారు. అతని వద్ద గల 1200 రూపాయలను అపహరించి పోరిపోయారు. అనంతరం బాధితుడు చికిత్స కోసం సమీప ఆస్పత్రికి వెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ లక్ష్మణరావు ఆదేశాల మేరకు ఎస్సై అశోక్‌కుమార్ తన బృందంతో గాలించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఒకరు పరారీలో ఉండగా.. ప్రధాన నిందితుడు చెన్న అఖిల్ పట్టుబడ్డారు. ఇదిలా ఉంటే ఇతనిపై గతంలో ఎనిమిది దొంగతనం కేసులున్నాయి. ఈ క్రమంలో నిందితుడి నుంచి నాలుగు స్కూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్, తదితరులను డీఎస్పీ అభినందించారు.