
జిందాల్ భూములు రైతులవే..
శృంగవరపుకోట: జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖా మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. జిందాల్ నిర్వాసితులకు సంఘీభావంగా బొడ్డవర గ్రామంలో ఎమ్మెల్సీ రఘురాజు స్వగృహంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 18 ఏళ్లు గడిచినా పరిశ్రమ స్థాపించకపోతే కంపెనీకి భూములపై ఏ హక్కు ఉంటుందని ప్రశ్నించారు. జిందాల్‌పై పోరాటం చేస్తున్న రైతులకు ఏపీ రైతు సంఘాలు సమైక్యంగా మద్దతిస్తాయన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి బడా నాయకులు, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు కొమ్ముకాయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహదేవ్ మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు లాక్కుంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. సేకరించిన భూముల్లో కంపెనీలు పెట్టకపోతే మూడేళ్ల తర్వాత ఆ భూములు రైతులకే చెందుతాయని చెప్పారు. ‘లీడర్’ పత్రిక సంపాదకుడు రమణమూర్తి మాట్లాడుతూ, రైతులు భూములు వదులుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో రైతు ఉద్యమ స్పూర్తితో మనం పని చేయాలన్నారు. నాడు ప్రభుత్వ సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి.. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. రైతులకు అండగా అన్నివర్గాలు నిలుస్తున్నాయని చెప్పారు. జిల్లా రైతుసంఘ అధ్యక్షుడు చల్లా జగన్ మాట్లాడుతూ... పక్షం రోజులుగా రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం బాధాకరమన్నారు. సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల, వర్గాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో జిందాల్‌కు భూములిచ్చిన ఐదు పంచాయతీల రైతులు హాజరయ్యారు.
రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి