
అర్జీలను పరిష్కరించాలి
మానవీయ కోణంలో..
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
ఈ చిన్నారి పేరు సవర రిత్విక్. తల్లి సవర జ్యోతి, తండ్రి తిరుపతి. వీరిది సీతంపేట మండలం రేగుల గూడ గ్రామం. చిన్నతనం నుంచి ఎడమ కాలు పనిచేయడం లేదు. ఈ చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఉంది. అయితే తిరుపతికి ఉద్యోగం లేకపోయినా ఉందని చెబుతూ ఇంతవరకు చిన్నారికి పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసేందుకు తల్లిదండ్రులతో చిన్నారి వచ్చింది.
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులకు హితవు పలికారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులకు మేలు జరగాలని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 109 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సిబ్బందిక సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చిత్తశుద్ధితో 48గంటల్లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్. పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం. సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఆవాల పకీరునాయుడు, తదితరులు కోరుతూ వినతిపత్రం అందజేశారు.
● గోశాల నిర్మాణానికి సంబంధించి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భూమిని సబ్ కలెక్టర్ పరిశీలించారని, అనుమతులు మంజూరు చేస్తే గోశాల పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ తోటపల్లి సర్పంచ్ ఆవాల సింహాచలం, తదితరులు వినతిపత్రం ఇచ్చారు.

అర్జీలను పరిష్కరించాలి