
పాలిటెక్నిక్ కళాశాల మూసివేత ప్రతిపాదనను రద్దు చేయాలి
విజయనగరం అర్బన్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా చూడాలని చింతపల్లి స్థానికులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును కోరారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ అయినట్లు వారు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. 2011లో స్థానిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి చింతపల్లిలో సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారని, ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్ధులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని స్థానికులు తెలిపారు. అయితే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన చైర్మన్ డాక్టర్ శంకరరావు, ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉండాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ఎస్టీ కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. చింతపల్లి ప్రాంతంలో వ్యవసాయ కళాశాల అవసరాన్ని గుర్తించి అప్పట్లో ఈ కళాశాల ఏర్పాటైందని, స్థానికులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి కళాశాల కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్‌కు వినతి ఇచ్చిన చింతపల్లి స్థానికులు