
గర్భిణుల ఆరోగ్యం పట్ల అప్రమత్తం
సీతానగరం: మండలంలోని గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని పీహెచ్‌సీ డాక్టర్ పి.ఉషారాణి అన్నారు. ఈ మేరకు స్థానిక పీహెచ్‌సీలో శుక్రవారం గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ మేరకు డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ గర్భిణుల్లో ఎక్కువ మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్) ఉన్నట్లు గుర్తించామన్నారు. రక్తహీనత నివారణకు ఐరన్ సుక్రోజ్ మందులు ఇవ్వనున్నామని, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఐసీడీఎస్ శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పాలు, గుడ్లు, చక్కీలు విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే ప్రతి నెలా పీహెచ్‌సీల్లో గర్భిణులకు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవ సమయానికి గర్భిణులందరూ చేరాలని కోరారు. అలాగే సీజనల్ వ్యాధులు వస్తున్న కారణంగా వైద్యసిబ్బంది అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియ జేశారు. పీహెచ్‌సీ ఓపీలో రోజుకు 65 నుంచి 80 మంది రోగులకు సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.