
నకిలీ ఎరువుతో జాగ్రత్త!
● ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
● మొదలైన పురుగు మందులు, ఎరువుల విక్రయాలు
● కొనుగోలు విషయంలో అవగాహన
తప్పనిసరి
● రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
● జిల్లాలో సుమారు 328 దుకాణాలు
రామభద్రపురం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రస్తుతం కొద్దో గొప్పో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటల సాగు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో వరి 6510 హెక్టార్లు, పత్తి 1490 హెక్టార్లు, మొక్కజొన్న 6678 హెక్టార్లు, వేరుశనగ 46 హెక్టార్లు, చెరకు 1489 హెక్టార్లు, కూరగాయలు 1000 హెక్టార్లలో సాగులో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అలాగే ప్రభుత్వం అనుమతి పొందిన సుమారు 328 పురుగుమందులు, ఎరువుల దుకాణాలు జిల్లాలో ఉన్నాయి. అయితే పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని రైతులు ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగిస్తున్నారు. అన్నదాతల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నకిలీ ఉత్పత్తులను అంటగట్టే అవకాశముందని, అప్రమత్తంగా వ్యవహరించకుంటే మోసపోయే ప్రమాదముందని ప్రస్తుతం అకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు, వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.
దళారుల వద్ద కొనుగోలు చేయొద్దు
నిషేధిత మందులు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కొందరు ఎరువులు, పురుగు మందుల వ్యాపారులు దిగుబడి ఎక్కువగా వస్తుందని నమ్మించి అనుమతి లేని వివిధ కంపెనీల కల్తీ ఎరువులు, పురుగు మందులు అంటగట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుమతులు లేని దుకాణాలు, దళారుల వద్ద కొనుగోలు చేయరాదు. తక్కువ ధరకే ఇస్తున్నారని కొని వాడితే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుంది. కొనుగోలు చేసేటప్పుడు మందుల లేబుల్స్ పరిశీలించి, అవి కంపెనీ ఉత్పత్తులా? లేక స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవాలి.కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా దుకాణ యజమాని సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలి. ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన సంచుల సీల్ తొలగించినట్లు గుర్తిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నకిలీలపై ఫిర్యాదు చేయాలి.అధికారుల పరిశీలనలో అది వాస్తవమని తేలితే సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది.

నకిలీ ఎరువుతో జాగ్రత్త!

నకిలీ ఎరువుతో జాగ్రత్త!