
అక్షరాంధ్రతో శతశాతం అక్షరాస్యత
విజయనగరం అర్బన్: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రత్యేక కార్యక్రమం ద్వారా దశలవారీగా జిల్లా ప్రజలందరినీ అక్షరాస్యులను చేయాలని సూచించారు. దీనిలో భాగంగా మొదటి విడత సుమారు లక్షన్నర మందిని అక్షరాస్యులను చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఈ మేరకు అక్షరాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమం అమలుకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఉపాధిహామీ వేతనదారులు, వెలుగు, మెప్మా, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ ఆయాలు, ఆ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణులు, బాలింతల్లో నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులను చేయాలని సూచించారు. ఈ నెల 26లోగా నిరక్షరాస్యుల జాబితాను రూపొందించాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏపీఓ, సీడీపీఓ, ఎంఈఓలు సభ్యులుగా మండల కమిటీలను ఈ నెల 26లోగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వలంటీర్ల ఎంపికను త్వరగా పూర్తి చేసి, వారికి శిక్షణ నిర్వహించాలని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలను సైతం వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వయోజన విద్య ఇన్‌చార్జ్ డీడీ ఎస్.సుబ్రహ్మణ్య వర్మ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ ఇచ్‌చార్జ్ పీడీ సావిత్రి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, డ్వామా పీడీ శారదాదేవి, జీఎస్‌డబ్ల్యూఓ జిల్లా కోఆర్డినేటర్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు.
వాయు కాలుష్యం లేని నగరంగా విజయనగరం
విజయనగరం పట్టణాన్ని వాయు కాలుష్యంలేని నగరంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ ఆదేశించారు. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ) కింద కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఎన్‌సీఏపీ కింద పార్కులు, రహదారుల అభివృద్ధి కోసం జిల్లాలో 14 పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపగా రూ.2.84 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అందులో నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరానికి 12 పనులకు రూ.71 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 4 పార్కులను అభివృద్ధి చేసేందుకు అలాగే బీటీరోడ్లు, ఉద్యానవనాల పెంపకం, డ్రైనేజీలు, ఫుట్‌పాత్స్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. సమావేశంలో కాలుష్య నియంత్రణమండలి ఈఈ సరిత, కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి మధుసూదనరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యాన శాఖ డీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్