
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనుల పండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంట పంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశా రు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీప కాంతుల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానన్నారు. పోలీసు వెల్ఫేర్ డేలో భాగంగా సిబ్బంది ఒక్కొక్కరిని తన చాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకుని వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
బాక్సింగ్ పోటీల్లో
విజేతలుగా నిలవాలి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు విజయం సాధించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు. అవనాపు భార్గవి ఆకాంక్షించారు. ఈనెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నం రైల్వే స్టేడియంలో జరిగే 6 వ రాష్ట్ర సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సెల్ దొంగకు దేహశుద్ధి
రామభద్రపురం: మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ఆగి ఉన్న బస్‌లో ఓ వ్యక్తి నుంచి సెల్ దొంగలించి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఒడిశా రాష్ట్రానికి చెందిన బస్ ఆగి ఉంది. బస్సులోని ఓ వ్యక్తి దగ్గర నుంచి ఇద్దకు యువకులు సెల్ దొంగలించి కిందికి దిగి ఇద్దరూ చెరోవైపు పారిపోతున్నారు. ఇంతలో స్థానికులు వెంబడించి ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.సెల్ పట్టుకుని పారిపోయిన యువకుడు తప్పించుకున్నాడు. దొరికిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిద్దరు అనకాపల్లికి చెందిన వారుగా తెలిసింది.
పుస్తెల తాడు చోరీ
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండాలపేటలో శుక్రవారం చోరీ జరిగింది. సత్యవతి అనే మహిళ తన పొలంలో వరి ఊడ్పు పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కుని పారిపోయినట్లు బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైభవంగా సహస్ర దీపాలంకరణ

వైభవంగా సహస్ర దీపాలంకరణ

వైభవంగా సహస్ర దీపాలంకరణ