
అన్నీ రిఫరల్ కేసులేనా..!
● రోగుల రిఫర్‌పై వైద్యులు, అధికారుల వాదన
● సీరియస్ లేకున్నా జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు
● 108 జిల్లా మేనేజర్
● రోగికి బాగుందా లేదా అన్నది
మేం డిసైడ్ చేస్తాం
● సీహెచ్‌సీ సూపరింటెండెంట్
బొబ్బిలి: మూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా బొబ్బిలి సీహెచ్‌సీ నుంచే జిల్లాకేంద్రానికి రోగులను రిఫర్ చేస్తున్నారని, ఇక్కడి వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నందున సీహెచ్‌సీకి వచ్చిన రోగులను ఐపీలో ఉంచేందుకు ఇష్టపడక చిన్న రోగానికి కూడా రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూర్చే విధంగా శుక్రవారం ఓ సంఘటన జరిగింది. ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు, వైద్యులు 108 మూడు జిల్లాల మేనేజర్‌ల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ప్రతి చిన్న విషయానికి 108కి ఫోన్ చేసి రమ్మంటున్నారని, రోగులు నడిచి వెళ్లగలిగే పరిస్థితుల్లోనూ 108 వాహనాన్ని పిలిచి రోగులను తరలించడం వల్ల వివిధ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు 108 వాహనాలను పంపించలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథరావు అన్నారు. దీనికి ఆస్పత్రి సూపరింటెండెంట్ జి శశిభూషణ రావు మాట్లాడుతూ రోగులను 108లో పంపించాలా? మామూలుగా ఇక్కడే వైద్యం చేయించాలా అన్న విషయాన్ని నిర్ణయించేది మేము. మీరెలా చెప్పగలరు? అని ఎదురు ప్రశ్నించారు. రోగి స్థితి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని, నిలకడగా ఉండదని అలాంటప్పుడు మేం ఎలా రిఫర్‌చేయకుండా ఉంచుతామన్నారు. మీరు ఒక వేళ 108 పంపించలేమని అనుకుంటే మాకు రాసిచ్చేయండి. మేం ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. పోర్టికో వద్ద జరుగుతున్న ఈ వాదనను రోగులు, ఇతర వైద్యసిబ్బంది వచ్చి చూస్తూ ఉండి పోయారు. మరో వైద్యురాలు మాట్లాడుతూ మీరు వాహనాలు పంపించేందుకు ఇష్టపడకపోతే ఎలా మేం రిఫర్ రాస్తాం. అలాంటప్పుడు రోగికి ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని అన్నారు. ఒక్కో అంబులెన్స్ డ్రైవర్ చాలా రెక్‌లెస్‌గా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.
కంప్లైంట్ ఇవ్వండి
ఇక్కడ ఆస్పత్రిలో వైద్యులు రోగులను ఉంచడం లేదు. అందర్నీ రిఫర్ చేస్తున్నారని మీరు కంప్లైంట్ ఇవ్వండి మా కంప్లైంట్ మేం ఇచ్చుకుంటామని సూపరింటెండెంట్ శశిభూషణ రావు అన్నారు. చాలా కేసులకు విజయనగరం వెళ్లి వస్తున్నామని, జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి దాదాపు 6 గంటలు పడుతోందని ఈ లోగా ఏమైనా ఏక్సిడెంట్‌లు జరిగితే అందుబాటులో ఉండలేకపోతున్నామని 108 మేనేజర్ మన్మథ రావు అన్నారు. రోగుల వైద్యం కోసం ఇలా వాదులాడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.