
అనుమతుల్లేని పాఠశాలను రద్దు చేయండి
పార్వతీపురం టౌన్: అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. మక్కువ మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతుల్లేకుండానే ఫ్లెక్సీల్లో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ సిలబస్‌లు ఉన్నట్లు పొందుపరిచి తల్లిదండ్రులను మోసం చేస్తోందన్నారు. పాఠశాలలో పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. సదరు పాఠశాలకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హరికృష్ణ, దుర్గాప్రసాద్, నాయకులు వికాస్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.