
పోలీసులకు చెమటలు పట్టించి తప్పించుకుపోయారు..
రామభద్రపురం: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్కూటీతో పోలీసులను పరుగులెత్తించారు. అయినా గంజాయి.. సంబంధిత వాహనాన్ని వారు వదిలేసి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొట్టక్కి వద్ద ఎస్ఐ వి.ప్రసాదరావు శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తున్నారు. సాలూరు నుంచి స్కూటీపై హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు దూసుకురాగా అతి వేగాన్ని కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశంతో ఎస్ఐ ఆపారు. వారు ఆపకపోవడంతో ఎస్ఐ స్టేషన్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి అతివేగంతో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు గాంధీ బొమ్మ సెంటర్లోని సాలూరు నుంచి రామభద్రపురం వచ్చే టర్నింగ్ వద్ద కాపు కాశారు. ఆ సమయంలో అటుగా వస్తున్న డీఎస్పీ భవ్యారెడ్డి వాహనాన్ని కూడా తప్పించుకొని దూసుకెళ్లిపోయారు. దీంతో డీఎస్పీ కూడా ఆ బైక్‌ను వెంటాడారు. సెంటర్లో ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో డీఎస్పీ వాహనం వెనుకబడింది. ఈ క్రమంలో బైక్‌తో మరింత స్పీడుగా ఆ ఇద్దరు చిన్నమ్మతల్లి ఆలయం వైపున్న పక్క రూట్లోకి వెళ్లారు. ఆ రూట్ ఎటు వెళ్తుందో తెలియక మళ్లీ మెయిన్ రూట్లోకి వచ్చారు. బొబ్బిలి వెళ్లే రహదారికి వచ్చి వేగవంతంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో బైక్ కిందపడిపోయింది. అయితే వీరి వద్ద గంజాయి ఉండని తెలియక డీఎస్పీ వాహన చోదకులకు ఏమైందోనని ఆందోళన చెందారు. డీఎస్పీ తన వాహనం నుంచి దిగి వచ్చేలోపు వాహనదారులు వాహనాన్ని, వారితో ఉన్న రెండు బ్యాగులు, హెల్మెట్లు అక్కడే వదిలేసి పక్క పొలాల్లోకి పారిపోయారు. డీఎస్పీ వాహనం వెనుక వస్తున్న పోలీసులు వారి వెంట పడ్డారు. ఇంతలో చీకటి కావడంతో వారు రామభద్రపురం గ్రామంలోకి వెళ్లిపోయారు. పోలీసులు కనిమెరక వీధి, అగురు వీధి, గ్రామం పక్కనే ఉన్న పొలాల్లో గాలించారు. అయినా ఎక్కడా వారు కనిపించలేదు. పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో వాహనదారులు విడిచిపెట్టిన బైక్, రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులను పరిశీలించగా అందులో సుమారు 23 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ద్విచక్ర వాహన నంబరును పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు విశాఖలో ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేశారు.
తప్పించుకోబోయి డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టిన బైక్
పారిపోయిన గంజాయి తరలిస్తున్న నిందితులు