బొబ్బిలి చీరల్లో వైరెటీ చూపించాలి
● చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్
బలిజిపేట: చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని నారాయణపురంలో చేనేత కార్మికుల స్థితిగతులను మంగళవారం ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు చేస్తూ బొబ్బిలి చీరలకు వైరెటీ కల్పించాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బుటా చీరలను తయారుచేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రకరకాల చీరలను తయారుచేసేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించనున్నట్లు చెప్పారు. చీరలు తయారుచేసేందుకు అవసరమైన మెటీరియల్ ఏమిటి? ఎక్కడ నుంచి వస్తుంది? ఇంకా ఎటువంటి మెటీరియల్ అవసరం, నైపుణ్యాలను పెంచాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? చేనేత రంగాభివృద్ధికి శాఖా పరమైన సహాయసహకారాలు ఎంతమేర అవసరం అనే విషయాలపై వారితో చర్చించి వారినుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంచి నాణ్యమైన సరుకులు తయారుచేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి.నాగేశ్వరరావు, శ్రీకాకూళం ఎ.డి జనార్దన రావు, అసిస్టెంట్ డివిజనల్ అధికారి రమణ, చేనేత కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.


