నగరంలో
నిఘా వైఫల్యం
రాజకీయ
అండదండలతో
అరాచకాలు
వరుస
నేరాలతో
పోలీసులకు
సవాల్
పక్క రాషా్ట్రల,
జిల్లాల రౌడీలకు
విశాఖలో
షెల్టర్లు
పోలీసుల
మెతక
వైఖరితో
బరితెగింపు
ద్వారకా నగర్ : కూటమి ప్రభుత్వంలో విశాఖ నేరాలకు అడ్డాగా మారింది. నేరస్తులు వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా నిలుస్తున్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోగా, నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు పాత నేరస్తులు, రౌడీ షీటర్లు మరింతగా బరితెగిస్తూ పోలీసులంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. వీరిపై పూర్తిస్థాయిలో పోలీస్ నిఘా లేకపోవడంతో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉన్న వారు మరో స్టేషన్ పరిధిలోకి వెళ్లి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. రౌడీ షీటర్లకు పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదు. భూ సెటిల్మెంట్లు, వివాదాల్లో జోక్యం చేసుకుంటూ భారీగా సొమ్ము కూడబెట్టుకుంటున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండటంతో కొందరు రౌడీ షీటర్లపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.నగర శివారు ప్రాంతాల్లో కొందరు నేతల, అధికారుల బినామీ భూముల్లో తిష్ట వేసుకుని అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నివేదికల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రౌడీ షీట్ ఒకచోట..
నేరాలు మరోచోట
విశాఖలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీట్లు ఉన్న వారు తమ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి నేరాలకు పాల్పడుతున్నారు. వీరిపై పూర్తిస్థాయి నిఘా లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. పక్క జిల్లాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ కొందరు రౌడీ షీటర్ల నేర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు విశాఖలో ఆశ్రయం పొందుతూ ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారు. ద్వారకానగర్ దారి దోపిడీ కేసులో విజయవాడకు చెందిన రౌడీ షీటర్ మాన మనోజ్ అలియాస్ మున్న కీలక సూత్రధారిగా ఉన్నాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదైంది. దీంతో అక్కడి పోలీసులు అతడిని నగర బహిష్కరణ చేశారు. అనంతరం విశాఖకు వచ్చిన మున్న ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. డాలర్ల మార్పిడి పేరుతో దోపిడీలకు పాల్పడి భారీగా నగలు, నగదు దోచుకున్నాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.ఇదే తరహాలో కొందరు రౌడీ షీటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన కొందరు రౌడీ షీటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినా అక్కడి నుంచే నగరంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
యాక్టివ్ రౌడీ షీటర్లపై నిఘా ఏది?
నగరంలో చాలామంది రౌడీ షీటర్లు యాక్టివ్‌గా ఉన్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ హల్‌చల్ చేస్తున్నారు. వీరిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలోకి వెళ్లినప్పుడు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గ్రూపులుగా విడిపోయి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 630 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం. వారిలో 140 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసు నిఘాలో తేలింది. ఇప్పటికే కొందరు వివిధ కేసుల్లో జైలులో ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్న వారిలో కొందరు నేరాలకు దూరంగా ఉండగా, మరికొందరు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.


