ఇలా పెట్టారు.. అలా పీకేశారు.!
విశాఖ రైళ్లకి లోకల్ పేర్లు
ఒక్కరోజు ముచ్చటేనా.?
సువర్ణరేఖ, గోస్తనీ మొదలైన పేర్లతో
రైళ్లపై బోర్డులు దర్శనం
2022 నుంచి
స్థానిక పేర్లు పెట్టాలనే డిమాండ్
ఎలాంటి అనుమతులు రాకుండానే
పొరపాటున పెట్టామంటూ వివరణ
ప్రతిపాదించిన పేర్లు కొనసాగించాలంటూ ప్రయాణికుల డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలు, నదులు, ఫేవరెట్ ఫలాల పేర్లతో ఉన్నట్టుండి విశాఖపట్నం నుంచి నడిచే రైళ్లపై కొత్త బోర్డులు దర్శనమిచ్చాయి. ఇది చూసిన ఉత్తరాంధ్ర వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. రైల్వే అధికారుల అత్యుత్సాహంతో ఏర్పాటు చేసిన ఆ బోర్డులను, పైస్థాయి అధికారుల ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించారు. 2022 నుంచి బలంగా వినిపిస్తున్న లోకల్ పేర్ల ప్రతిపాదన నెరవేరిందని అనుకునేలోపే.. ‘అబ్బెబ్బే.. తప్పుగా పెట్టేశాం. అలాంటిదేమీ లేద’ని విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులు బోర్డులను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. అనుమతి వచ్చినా.. రాకపోయినా.. కొత్త పేర్లను కొనసాగించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ వాసుల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ.. హఠాత్తుగా కొన్ని రైళ్లకు స్థానిక పేర్లు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా సువర్ణరేఖ, గోస్తనీ, ఎల్లోరా పేర్లతో కూడిన బోర్డులను మూడు రైళ్లకు తగిలించారు. విశాఖపట్నం–బనారస్–గాంధీధామ్ రైలుకు సువర్ణరేఖ ఎక్స్‌ప్రెస్ అని, విశాఖపట్నం–దుర్గ్–కిరండూల్ రైలుకు గోస్తనీ ఎక్స్‌ప్రెస్ అని, విశాఖపట్నం–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సాయినగర్ షిర్డీ రైలుకు ఎల్లోరా ఎక్స్‌ప్రెస్ అని బోర్డులను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి రైళ్లకు ఈ పేర్లు పెట్టడంపై నెటిజన్లు, రైల్‌ఫ్యాన్స్ అసోసియేషన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించినందుకు రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు కూడా వెల్లువెత్తాయి.
2022 నుంచే బలమైన డిమాండ్
వాస్తవానికి ఈ రైళ్లకు స్థానిక పేర్లు పెట్టాలనే డిమాండ్ 2022 నుంచే ఉంది. అప్పటి వాల్తేరు డివిజన్ నుంచి నడిచే మొత్తం 17 రైళ్లకు రుషికొండ, సింహాచలం, దంతేశ్వరి, వంశధార, సువర్ణరేఖ, గోస్తనీ, ఎల్లోరా, కురుసుర, సాగరకన్య, దంతేశ్వరి, వాల్తేరు, వంశధార, ఛత్రపతి ఉక్కునగర్ వంటి పేర్లను సూచిస్తూ అప్పటి డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న రైళ్లకు సరైన పేర్లు లేకపోవడంతో సామాన్యులు ట్రైన్ నంబర్లను గుర్తుపెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక వారసత్వ ఆనవాళ్ల పేర్లు పెడితే సులువుగా గుర్తిస్తారని అందులో పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రతిపాదనను జోనల్ అధికారులు బుట్టదాఖలు చేశారు. జోన్ వచ్చిన తర్వాత ఈ పేర్ల ప్రతిపాదన మరోసారి రైల్వే శాఖ దృష్టికి వెళ్లింది. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందస్తుగా బోర్డులు కూడా తయారు చేశారని సమాచారం.
కొనసాగించాల్సిందే
తాజాగా జరిగిన ‘బోర్డుల తొలగింపు’ వ్యవహారం స్థానికులను నిరాశకు గురిచేసినా, ఆ పేర్లనే అధికారికంగా ఖరారు చేయాలన్న డిమాండ్‌ను మరింత తీవ్రం చేసింది. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో, వాల్తేరు చారిత్రక ఆనవాళ్లను కొనసాగించేలా ప్రతిపాదించిన 17 రైళ్ల పేర్లనే పెట్టాలని రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, విశాఖపట్నం జంక్షన్ ఫేస్‌బుక్ పేజ్ ఫాలోవర్స్, ప్రయాణికులు పట్టుబడుతున్నారు. ఉక్కునగరం పోరాట స్ఫూర్తి, రుషికొండ సాగర సోయగం, సింహాచల అప్పన్న ఆశీస్సులు, వంశధార జీవనదార.. ఇవన్నీ కేవలం పదాలు కావని, తమ భావోద్వేగాలని స్థానికులు బలంగా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్‌పై మరోసారి దక్షిణకోస్తా రైల్వే జోన్ జీఎం, సీపీటీఎం దృష్టి సారించి.. ఎలాగైనా కొత్త బోర్డులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమతి లేదంట.. అందుకే తీసేశారంట
అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రైళ్లకు తగిలించిన ఆ బోర్డులను డివిజన్ అధికారులు ఒక్కరోజులోనే తొలగించారు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ పేర్ల మార్పునకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేదని తేలింది. కొందరు స్థానిక రైల్వే అధికారులు లోకల్ ప్రేమతో.. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకుండానే పొరపాటున ముందుగానే బోర్డులు మార్చినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న డివిజన్ అధికారులు వెంటనే స్పందించి ఆ బోర్డులను తొలగించారు. దీంతో అందరిలోనూ నిరుత్సాహం నెలకొంది.


