రెచ్చిపోతున్న ‘మధుకంద’ | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ‘మధుకంద’

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

నిఘా వైఫల్యం

వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న కొందరు రౌడీ షీటర్లు పోలీసులకు సవాల్‌గా మారారు. మరోవైపు తమ చర్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో అసాంఘిక శక్తులకు చోటు లేకుండా చూడాలని, నేరాల నియంత్రణకు కృషి చేయాలని డీజీపీతో పాటు నగర పోలీస్‌ కమిషనర్‌ పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ నగరంలో రౌడీ షీటర్ల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి నేతల అండదండలు ఉండటం, కొందరు పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం రౌడీ షీటర్లకు అనుకూలంగా మారింది. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై సీపీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరి తీరులో మార్పు కనిపించడం లేదు. పూర్తిస్థాయి నిఘా లేకపోవడంతో నగరంలో రౌడీ షీటర్లు చురుగ్గా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

చర్యలు శూన్యం

కొందరు రౌడీ షీటర్లకు రాజకీయ అండదండలు ఉన్నాయి. రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ వారు చెప్పిన పనులు చేస్తూ వారికి విశ్వాసపాత్రులుగా ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఈ నాయకులే వారికి అండగా నిలుస్తున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, వివాదాల్లో రౌడీ షీటర్లను వినియోగిస్తున్న ఘటనలు నగరంలో అనేకం చోటుచేసుకున్నాయి. యాక్టివ్‌గా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

కంచరపాలెం: శ్రీనగర్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ మధుకంద నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కాలనీ వాసులు కంచరపాలెం సీఐ కోరాడ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఆగస్టులో కాలనీకి చెందిన దమ్ముల రాజేష్‌పై దాడి జరిగి చికిత్స పొందుతూ మృతి చెందాడని, అనంతరం నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిపై దాడి చేస్తుండగా మధుకంద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాడని, రాత్రివేళ కత్తులతో తిరుగుతూ ఫ్లెక్సీలు చించుతూ..అడ్డొచ్చేవారిని బెదిరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement