డేటా సెంటర్లకు అనుమతులపై పౌర సంఘాల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్లకు అనుమతులపై పౌర సంఘాల ఆందోళన

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

● పర్యావరణం, నీటి వనరులపై ప్రభావం పరిశీలించాలి ● బీచ్‌ షాక్స్‌ జీవో 362ను రద్దు చేయాలని డిమాండ్‌

బీచ్‌రోడ్డు: డేటా సెంటర్లు, బీచ్‌ షాక్స్‌ వల్ల భూమి, నీరు, విద్యుత్‌, ప్రకృతి, పర్యావరణం, సంస్కృతి తీవ్ర ప్రభావం చూపుతుందని పౌర సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణంలో విశాఖ పౌర సమావేశం బుధవారం నిర్వహించారు. పౌర చైతన్య వేదిక విశాఖ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.కొలవెన్ను చాంద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీడీఆర్‌ఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ కుంచె శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఏఐ డేటా సెంటర్లకు ప్రభుత్వాలు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయని, వాటి కోసం విశాఖ పరిసరాల్లో చెట్ల తొలగింపు, కొండల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డేటా సెంటర్ల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.

గ్రీన్‌ విశాఖ అధ్యక్షుడు రాజా రామమోహన్‌ రాయ్‌ మాట్లాడుతూ పర్యావరణ విధ్వంసం భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే నీటి కొరత ఉన్న నేపథ్యంలో భారీగా నీరు అవసరమయ్యే డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌర చైతన్య వేదిక కార్యదర్శి సీహెచ్‌ ప్రమీల మాట్లాడుతూ బీచ్‌ షాక్స్‌ వల్ల తీర ప్రాంత ప్రశాంతతకు భంగం కలగడంతోపాటు మహిళల భద్రత, సామాజిక సంస్కృతిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలని, బీచ్‌ షాక్స్‌కు సంబంధించిన జీవో 362ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రీన్‌ విశాఖ, పౌర చైతన్య వేదిక ప్రతినిధులు అచ్చిబాబు, తిరుపతిరావు, ఎస్‌.గోవిందరాజులు, విద్యార్థి సంఘ నాయకులు అభిలాష్‌, సంతోష్‌, ధృవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement