సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి(డీఎస్‌ఎల్‌యూ) పూర్వ విద్యార్థులు 9 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కావడం విశ్వవిద్యాలయ ఘనతకు నిదర్శనమని వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు అన్నారు. న్యాయమూర్తులుగా ఎంపికై న ఎల్.సూర్యకాంత్, వై.దివ్యచౌదరి, బి.విశ్వజాహింద్, కె.బిందు, డి.రిషికిరణ్, ఎన్.గౌతమి, అమన్‌దీప్ మాలిక్, సాయి శ్రీకీర్తన, షేక్ మొహమ్మద్ అజామ్‌లను బుధవారం వర్సిటీలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వృత్తిపరంగా ఉపయోగపడే విద్యను, అవసరమైన శిక్షణను అందించడంలో ఎప్పుడూ రాజీపడటం లేదన్నారు. వర్సిటీ నుంచి అనేక మంది విద్యార్థులు న్యాయమూర్తులుగా, కార్పొరేట్ సంస్థల్లో న్యాయవాదులుగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో లా ఆఫీసర్లుగా స్థిరపడుతున్నారని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్‌లో ఒకేసారి 9 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కావడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. న్యాయమూర్తులుగా ఎంపికై నవారు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత పాటించాలని సూచించారు. ‘ప్రారంభం’పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇకపై ఏటా వర్సిటీ నుంచి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సన్మానించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎన్నికై న పూర్వ విద్యార్థులను ఉపకులపతి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌లోని విభాగాన్ని ఎంపికై న జూనియర్ సివిల్ జడ్జిలతో ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్ విశ్వచంద్రనాథ్, అధ్యాపకులు డాక్టర్ సోమా భట్టాచార్య, డాక్టర్ దయానందమూర్తి, ప్రొఫెసర్ నందిని, కొండయ్య, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


