ఏయూలో ఫీజుల మంట! | - | Sakshi
Sakshi News home page

ఏయూలో ఫీజుల మంట!

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

వర్సిటీకి ‘షాడో’ సంకెళ్లు!

కార్పొరేట్‌ తరహా వసూళ్లు ఆపాలి

ప్రభుత్వ విద్యాసంస్థ అయిన ఏయూలో హాస్టల్‌ అభివృద్ధి పేరుతో వేలల్లో వసూలు చేయడం అన్యా యం. ఇక్కడ చదువుతున్నది పేద విద్యార్థులనే విషయాన్ని వర్సిటీ యంత్రాంగం పూర్తిగా మరిచిపోతోంది. ఏయూ రిజిస్ట్రార్‌ సగం ఫీజు అయినా కట్టాల్సిందే అనడం పేదలపై అదనపు భారమే. క్యాంపస్‌లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, కార్పొరేట్‌ తరహాలో ఏయూ చేస్తున్న దోపిడీ విధానాన్ని ఆపకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.

–కుసుమాంజలి, కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

విశాఖ విద్య: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రస్తుత పరిణామాలు మారుతున్నాయి. ఉన్నత విద్యాశాఖపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధా నాలు వర్సిటీ స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. సమూల మార్పుల పేరిట ప్రైవేటు వ్యక్తుల హస్తగతం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మేధావి వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయంలో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపక వర్గాల్లో ఒక రకమైన ఆందోళన వాతావరణం నెలకొంది.

ఉత్సవ విగ్రహాలుగా వీసీలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వర్సిటీలకు మేధావులను ఉపకులపతులుగా నియమిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఐఐటీల్లో పనిచేసిన అనుభవజ్ఞులను ఏయూ వీసీగా తెచ్చామని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో వారికి కనీస పాలనాపరమైన స్వేచ్ఛ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అసలు మంత్రి కంటే, విశాఖకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘షాడో’గా వ్యవహరిస్తూ వర్సిటీ వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సదరు నేత గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సిందే అన్న టాక్‌ నడుస్తోంది.

బడ్జెట్‌లో భారీ కోత.. శతాబ్ది వేడుకల వేళ నిరాశ!

శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న ఏయూకు బడ్జెట్‌ పరంగా పెద్ద షాక్‌ తగిలింది. 2026–27 వార్షిక బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయింపులు నామమాత్రంగా ఉండగా, ఏయూ వార్షిక బడ్జెట్‌ను రూ.389.34 కోట్లుగా తేల్చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.27.91 కోట్లు తక్కువ కావడం గమనార్హం. నిధుల కొరతతో వర్సిటీ పరిశోధనలు, మౌలిక వసతుల కల్పన కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోకపోతే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి మసకబారడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు.

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థులకు ‘వసతి’ ఇప్పుడు పెనుభారంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ‘వసతి దీవెన’ బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో చేతులెత్తేసిన వర్సిటీ యంత్రాంగం.. ఆ భారాన్ని విద్యార్థులపైకి నెట్టేసింది. ‘హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ పేరిట వేల రూపాయల కొత్త బాదుడుకు తెరలేపింది. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, కనీసం తలదాచుకునేందుకు రూమ్‌ కేటాయింపు కోసం పడిగాపులు కాస్తున్న విద్యార్థులపై రూ.5,500 కొత్త ఫీజు షరతు పెట్టడం క్యాంపస్‌లో కార్పొరేట్‌ తరహా దోపిడీని తలపిస్తోంది. అడిగితే సగం కట్టాల్సిందేనని రిజిస్ట్రార్‌ భీష్మించుకుని కూర్చోవడం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

రూ.5,500 కడితేనే రూమ్‌

హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పేరిట ఏకంగా రూ.5,500 చెల్లించాలని విద్యార్థులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ పెద్ద మొత్తాన్ని కడితేనే హాస్టల్‌ రూమ్‌ కేటాయిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ సారథ్యంలో విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబును నిలదీశారు. యూనివర్సిటీ అవలంబిస్తున్న ఇలాంటి నిర్ణయాలు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారాయని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పేరిట రూ.వేలు వసూలు చేయడం దారుణమని, తక్షణమే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే అధికారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. విద్యార్థుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని చెబుతూనే, ప్రస్తుతానికి సగం ఫీజు అయినా చెల్లించాల్సిందేనని రిజిస్ట్రార్‌ స్పష్టం చేయడంతో విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.

ఏయూలో పాలనా గ్రహణం

తెరవెనుక ప్రజాప్రతినిధి పెత్తనం

వీసీ స్వేచ్ఛకు బ్రేక్‌

బడ్జెట్‌లో కోతతో ఆర్థిక కష్టాలు

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేద విద్యార్థులు బలి

‘వసతి దీవెన’ విడుదల చేయని సర్కార్‌

‘హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ పేరిట కొత్త బాదుడు

రూ.5,500 కడితేనే రూమ్‌ అలాట్‌మెంట్‌

రిజిస్ట్రార్‌ను నిలదీసిన ఎస్‌ఎఫ్‌ఐ

విద్యార్థుల పడిగాపులు

కొత్త విద్యా సంవత్సరంలో హాస్టల్‌లో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చిన విద్యార్థినులకు వర్సిటీ అధికారులు గట్టి షాక్‌ ఇచ్చారు. ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఫీజులు చెల్లించాలంటూ హాస్టల్లో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. ఫీజుల భారం ఒక్కసారిగా పడటంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్‌ లోపలికి అనుమతించకపోవడంతో గంటల తరబడి ఫుట్‌పాత్‌లపైనే నిరీక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement