ఆగస్టు 14 నుంచి విశాఖ–అబుదాబీ విమాన సర్వీసుల పునఃప్రారంభం
వారానికి నాలుగు రోజులు నడపనున్న ఇండిగో
థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక సర్వీసులు మాత్రం ఇంకా గాల్లోనే..!
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులు, డజన్ల కొద్దీ దేశీయ విమానాలతో నిత్యం రద్దీగా కనిపించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం... ఇప్పుడు అంతర్జాతీయ కనెక్టివిటీ కోల్పోయి వెలవెలబోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు విశాఖ నుంచి అంతర్జాతీయ విమానాల విస్తరణపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టకపోవడంపై విమానయాన వర్గాలు, ప్రయాణికుల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండిగో సంస్థ విశాఖ–అబుదాబీ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది.
ఆగస్టు 14 నుంచి మళ్లీ అబుదాబీకి..
విశాఖ నుంచి అబుదాబీకి గతంలో నేరుగా విమాన సర్వీసులు విజయవంతంగా నడిచేవి. అయితే ప్రభుత్వ స్థాయిలో తగిన సహకారం లేకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండిగో ఆ సర్వీసులను నిలిపివేసింది. అప్పటి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి కనెక్టింగ్ విమానాలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండిగో తీసుకున్న నిర్ణయంతో ఆగస్టు 14 నుంచి విశాఖ–అబుదాబీ మధ్య విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు రోజుల పాటు ఈ విమానాలు నడవనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత విశాఖ నుంచి గల్ఫ్‌కు మళ్లీ నేరుగా విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
మిగిలిన మూడు సర్వీసులు ఎప్పుడో..?
అబుదాబీ సర్వీసులు పునరుద్ధరణ కావడం శుభపరిణామమే అయినప్పటికీ.. ఒకప్పుడు విశాఖ నుంచి నడిచిన థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక విమాన సర్వీసులు మాత్రం ఇప్పటికీ తిరిగి ప్రారంభం కాలేదు. విశాఖ–బ్యాంకాక్ మధ్య థాయ్ ఎయిర్‌ఏషియా విమానాలు గతంలో నడిచేవి. ఆదాయం తగ్గడంతో 2019 సెప్టెంబరులో వాటిని నిలిపివేసింది. అనంతరం తిరిగి ప్రారంభించేందుకు సంస్థ ఆసక్తి చూపినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. అలాగే విశాఖ–కౌలాలంపూర్ సర్వీసులకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ అవి కూడా నిలిచిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ అవకాశాలు హైదరాబాద్‌కు మళ్లాయి. ఇక శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విశాఖ–కొలంబో మధ్య ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విమాన సర్వీసు కూడా చరిత్రగా మారింది. దుబాయ్‌కు నేరుగా విమానం నడిపేందుకు అవకాశం వచ్చినా, ఆ సర్వీసును విజయవాడకు మళ్లించిన పరిస్థితి ఏర్పడింది.
విశాఖపై నిర్లక్ష్యమే కారణమా?
తూర్పు తీరంలో అత్యంత కీలక నగరంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న విశాఖకు అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ అత్యంత అవసరం. అయినప్పటికీ ఒక్కొక్కటిగా సర్వీసులు కోల్పోతుండడం నగర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అబుదాబీ సర్వీసుల పునరుద్ధరణతో కొంత ఆశ చిగురించినా.. థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, దుబాయ్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్గాలు తిరిగి అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని విమానయాన రంగ నిపుణులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.


