డాబాగార్డెన్స్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం మంగళవారం నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయ చాన్సలర్ మదన్‌లాల్ మీనా, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. సోమవారం విశాఖలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2020 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్టు చెప్పారు. విజయనగరం కేంద్రంగా 2019లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటై, 2020 నుంచి తరగతులు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో స్కూల్ ఆఫ్ సైన్సెస్ నుంచి 200 మంది, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ నుంచి 82 మంది, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి 91 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నట్టు వెల్లడించారు. విశిష్ట ప్రతిభ కనబరచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 11 మంది విద్యార్థినులు, ఇద్ద రు విద్యార్థులు ఉండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఫౌండర్ వీసీ టీవీ కట్టిమణి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు పాల్గొంటున్నట్టు వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా పాల్గొన్నారు.


