మరోసారి కుటిల బుద్ధి చూపించిన చంద్రబాబు ప్రభుత్వం
50 శాతం రైతులకు రాని సుఖీభవ నిధులు
కౌలు రైతులకు మళ్లీ మొండిచేయి
వైఎస్సార్‌సీపీ హయాంలో25,072 మంది సాయం
తాజాగా 18,573 మందిని గుర్తించిన ప్రభుత్వం
నిబంధనల పేరుతో లబ్ధిదారుల కుదింపుపై ౖరైతుల ఆగ్రహం
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తమ కుటిల బుద్ధిని చూపించింది. రైతన్నలను మళ్లీ మోసం చేసింది. నిబంధనల పేరుతో అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు పెట్టింది. సగం మంది రైతులకు పెట్టుబడి సాయం దక్కకుండా చేసింది. ప్రధానంగా ఈ దఫా కూడా కౌలు రైతులకు మొండిచేయి చూపించింది. ఎన్నికలకు ముందు ప్రతి అన్నదాతకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామని చంద్రబాబు బూటకపు హామీ గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కౌలు రైతులను పక్కనపెట్టడంతో పాటు నిజమైన రైతు లబ్ధిదారులు సగం మందిని అర్హుల జాబితా నుంచి తొలగించారు. అన్నదాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నెల 19న ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసినప్పటికీ, కేవలం 50 శాతం మంది రైతుల ఖాతాల్లోనే నిధులు జమయ్యాయి. మిగిలిన సగం మంది లబ్ధిదారులు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైన తరుణంలో, పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో తదుపరి పనులు సాగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6,499 మంది రైతులకు మొండిచేయి
వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో జిల్లాలో 25,072 మంది రైతులకు నేరుగా ఖాతాల్లో నిధులు జమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు 18,573 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అందులో కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం పరిధిలోకి 18,100 మంది ఉన్నారు. నిబంధనల పేరుతో ఏకంగా 6,499 మంది రైతులు ఈ పథకానికి దూరం చేయడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నిబంధనల పేరుతో వెన్నుపోటు
ఈ సారి కూడా కౌలు రైతులకు నిరాశే ఎదురైంది. గతేడాది కూడా వీరికి పెట్టుబడి సాయం అందించలేదు. ఈ ఏడాది అయినా ఖాతాలో డబ్బులు పడతాయని ఆశించిన కౌలు రైతులకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. కౌలు రైతుల పేరిట సొంత భూములు ఉండకూడదని, ఆన్‌లైన్ రికార్డుల్లో ఏ చిన్న భూమి ఉన్నా అనర్హులుగా తొలగించారు. దీనికి తోడు ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ పూర్తి కాకపోవడం, బ్యాంకు ఖాతాల సాంకేతిక లోపాలను సాకుగా చూపిస్తూ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను తొలగించారు.
కొత్త రైతులకు అడుగడుగునా ఆంక్షలు
ఈ ఏడాది కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి లేదా వారసత్వంగా భూ హక్కులు పొందిన రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ కింద ఎలాంటి సహాయం అందలేదు. కేవలం పాత డేటా ఆధారంగానే నిధుల పంపిణీ జరగడంతో వేలాది మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కొత్త పేర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దంటూ ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాలు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ సాయం అందకపోవడంతో గత్యంతరం లేక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించాల్సిన దుస్థితి ఏర్పడింది.


