గోపాలపట్నం: భర్త తనను మోసం చేశాడంటూ భార్య అతడి ఇంటి ముందు మౌన పోరాటం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని వెలుగువాడకు చెందిన గోర్ల వనజాక్షికి, పాత కరాసాకు చెందిన గోకర్ల శ్రీనివాసరావుకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే పెళ్లయిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వనజాక్షి ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమె కనిపించకుండా పోయిందంటూ మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి ఆమె పుట్టింట్లో ఉన్నట్లు గుర్తించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా, ఆ తర్వాత అత్తమామలు మళ్లీ వేధించడంతో ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఏడాది వనజాక్షి గర్భం దాల్చగా, ఆ గర్భాన్ని తీయించుకోవాలంటూ భర్త కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.
భార్య వస్తోందని తెలిసి ఇంటికి తాళం వేసి..
తన కుమారుడితో మాట్లాడించాలని కోరినా భర్త శ్రీనివాసరావు అవకాశం ఇవ్వలేదని వనజాక్షి కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలోనే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడిని చూసుకునేందుకు ఆమె కరాసాలోని భర్త ఇంటికి వచ్చింది. అయితే ఆమె వస్తున్నట్లు ముందే తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తనను, బిడ్డను నిర్లక్ష్యం చేస్తూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని వనజాక్షి ఆరోపిస్తూ ఆ ఇంటి ముందే కూర్చుని రోదిస్తూ నిరసన చేపట్టింది. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భర్త శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


