సింహాచలం: దేశానికి రైతే వెన్నుముక అని, రైతు లేకపోతే దేశం లేదని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు. వరాహ లక్ష్మీనసింహస్వామి దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో సోమవారం ఏరువాక పున్నమి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు నాగలి, ఎడ్లకు పసుపుకుంకుమలు సమర్పించి, హారతులు ఇచ్చి భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవొ జల్లేపల్లి వెంకటరావు స్వయంగా నాగలి పట్టి పొలాన్ని దున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు శ్రమకోర్చి పంటలు పండిస్తేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేద కాలంలో ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించేవారని, అదే స్ఫూర్తితో వ్యవసాయాన్ని పవిత్ర వృత్తిగా గుర్తిస్తూ జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమిగా జరుపుకుంటున్నామని తెలిపారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యేష్ట నక్షత్రంలో నాగలి పట్టి పనులు ప్రారంభించడం అత్యంత శుభప్రదమని, అందుకే వర్షాకాలం ప్రారంభంలో రైతులు ఎడ్లను శుభ్రపరిచి, వాటి కొమ్ములకు రంగులు పూసి, పూలమాలలు, గజ్జెలతో అలంకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో హిందు ధర్మపరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధి రాంబాబు, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఉషశ్రీ, సన్యాసిరావు, ఈఈ రాంబాబు, డీఈ హరి, ఏఈవో రమణమూర్తి, గోశాల సూపరింటిండెంట్ మూల వాసు, పాల్గొన్నారు.


