ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ప్రతిపక్షానికి లేదా?
అమరావతి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు
దాడిని ఖండించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బీఎస్ కృష్ణ
మహారాణిపేట: అమరావతి ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రభుత్వం తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని రైతులు మొరపెట్టుకోగా, వాస్తవాలు పరిశీలించేందుకే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన కమిటీని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంపించారని వివరించారు. తాడేపల్లి ప్రాంతంలో ఈ ఉన్నత స్థాయి కమిటీపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడటం అత్యంత దారుణమని ఖండించారు.
ప్రతిపక్షానికి ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు ఉందని, అమరావతి ఎవరి జాగీరూ కాదని అన్నారు. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ గాయపడటం విచారకరమని, హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారాలు ఎవరికీ శాశ్వతం కావని హితవు పలికారు. అలాగే, సాయికృష్ణ లాకప్ డెత్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా బి.ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు.


