సింహాచలం: నిజ జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి సోమవారం మూడో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు, అనంతరం సుమారు మూడు మణుగులు (సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని స్వామివారికి సమర్పించారు. తదనంతరం ఆరాధన, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ఆస్థాన మండపంలో వేంచేపు చేసి జ్యేష్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పంచామృతాలు, గంగధార జలాలతో అభిషేకాలు చేసి, విశేష హారతులు సమర్పించారు. నాలుగు వేదాల పారాయణాల నడుమ స్వామివారిని కీర్తించారు. శిరస్సుపై చందనంతో అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి భక్తులకు కనువిందు చేశారు.


