మహారాణిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా సేకరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ఆయన బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలు, ఇతర అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. అనంతరం సూర్యాబాగ్ జోనల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ తీరును పరిశీలించారు. మరణించిన, వలస వెళ్లిన, తప్పుగా నమోదైన ఓటర్లు, తొలగించాల్సిన ఓట్లు, ఇతర పోలింగ్ కేంద్రాలకు మారిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు.


