మహారాణిపేట: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయిల్లో ఫీవర్ సర్వేలు నిర్వహించి, జ్వరాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలని మంత్రి సూచించారు. హాస్టళ్లు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఫాగింగ్, దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని మంత్రి స్పష్టం చేశారు.


