పచ్చదనంపై జీవీఎంసీ పంజా..
ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో
భారీగా వృక్షాల నరికివేత
అప్పుడు ‘మొసలి కన్నీరు’..
ఇప్పుడు ‘మౌన వ్రతం’
అప్పుఘర్ బీచ్‌రోడ్డులో భారీగా కొమ్మలు
తొలగించడంతో
మోడుబారిన చెట్లు
ఎంవీపీకాలనీ: పచ్చని విశాఖ నగరంపై కూటమి ప్రభుత్వ మార్కు పగబట్టినట్లు కనిపిస్తోంది. ఒకవైపు భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో నగర ప్రజలు అల్లాడిపోతుంటే.. కనీసం కాస్త నీడనైనా ఇస్తున్న చెట్లపై జీవీఎంసీ సిబ్బంది గొడ్డలి వేటు వేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా పెంచి పోషించిన పచ్చదనాన్ని చూసి ఓర్వలేక.. నడిరోడ్డుపై పచ్చటి వృక్షాలను ‘మోడు’లుగా మార్చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి జీవీఎంసీ అధికారులు సాగిస్తున్న ఈ ‘వృక్ష విధ్వంసం’పై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై ‘నీడ’ కరవు
నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, బీచ్ రోడ్డు పరిసరాల్లో గత కొన్ని రోజులుగా చెట్ల కొమ్మలను విచక్షణారహితంగా నరికేస్తున్నారు. గత ప్రభుత్వం డివైడర్ల మధ్య, రహదారుల వెంబడి ఎంతో శ్రమించి పెంచిన పెద్ద పెద్ద చెట్లు వాహనదారులకు, స్థానికులకు చల్లటి నీడనిస్తూ సేదతీరుస్తుండేవి. కానీ, జీవీఎంసీ సిబ్బంది ఆదివారం రాక్షసానందంతో ఆ చెట్ల కొమ్మలన్నింటినీ నరికిపారేశారు. నిన్నటివరకు పచ్చదనంతో కళకళలాడిన రహదారులు.. నేడు బోసిపోయి అధ్వానంగా మారాయి. ఎంవీపీ కాలనీ సెక్టార్–8లోని పార్కు చుట్టూ ఉన్న చెట్లను కూడా వదలకుండా గుండు కొట్టేయడంతో ఆ ప్రాంతంలో నీడ కరువైంది.
నాడు గగ్గోలు.. నేడు గప్‌చుప్!
గత ప్రభుత్వ హయాంలో నగరంలో అభివృద్ధి పనుల కోసం ఎక్కడైనా చిన్న కొమ్మ తీసినా సరే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు రోడ్లెక్కి ఊగిపోయారు. పర్యావరణ ప్రేమికుల ముసుగు వేసుకుని భారీ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. మరి ఇప్పుడు నగర నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున పచ్చదనాన్ని చిదిమేస్తుంటే.. అదే కూటమి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వారి పర్యావరణ ప్రేమ కేవలం పచ్చ చొక్కాల ప్రయోజనాల కోసమేనా అని మండిపడుతున్నారు. పచ్చదనం కనుమరుగవుతుండటంతో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ వృక్ష విధ్వంసాన్ని ఆపకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు.


