తాటిచెట్లపాలెం: అమరావతి ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? అక్కడికి వెళ్లాలంటే విపక్ష నేతలకు వీసాలు, పాస్‌పోర్టులు ఏమైనా కావాలా? అని మేరువ గణేష్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి అక్కడికి వెళ్లే హక్కు ఉందన్న విషయాన్ని పచ్చ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం గూండాలు, రౌడీ మూకలతో సృష్టించిన అరాచకాన్ని ఖండించారు. స్థానిక రైతుల ఆత్మీయ ఆహ్వానం మేరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత శాంతియుతంగా అమరావతి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లారని తెలిపారు. అయితే, అక్కడ పర్యటిస్తే చంద్రబాబు మార్కు అవినీతి, అక్రమాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ భూకుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే.. కూటమి ప్రభుత్వం కావాలనే ప్లాన్ ప్రకారం రౌడీలను ప్రయోగించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిందని మండిపడ్డారు. ఇలాంటి అరాచక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, వారు చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.


