దేశ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

Jun 29 2026 12:47 AM | Updated on Jun 29 2026 12:47 AM

బీచ్‌రోడ్డు: నిరంతరం సమాజం కోసం పాటుపడే జర్నలిస్ట్‌లు దేశ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ పేర్కొన్నారు. ఆదివారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో వైజాగ్‌ మీడియా అవార్డ్స్‌, స్కూల్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ప్రతిభకు ప్రోత్సాహం పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ, మీడియా రంగంలో అత్యంత ప్రతిభావంతులైన 60 మందికి ఉత్తమ పాత్రికేయ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే 150 మంది జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ జర్నలిస్టులు సంచలనాలకు కాకుండా నిజాయితీగా కథనాలు ప్రజలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా స్కూల్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ సహకారంతో కొలంబో, బంగ్లాదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, ముంబైల నుంచి అంతర్జాతీయ స్థాయి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అవార్డులు, ఉపకారవేతనాల నిర్వాహక కమిటీ గౌరవ చైర్మన్‌ గంట్ల శ్రీనుబాబు, చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement