సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది మార్చి నాటికి రూ. 66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ చైర్మన్ జే.వీ.సత్యనారాయణమూర్తి శనివారం ద్వారకానగర్‌లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 1,17,884 మంది సభ్యుల ద్వారా సమకూరిన రూ. 416.29 కోట్ల షేర్ క్యాపిటల్‌తో దేశంలోని అర్బన్ బ్యాంకుల్లో వీసీబీ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ. 4,594.97 కోట్ల డిపాజిట్లు, రూ. 3,877.42 కోట్ల రుణాల మంజూరుతో కలిపి ప్రస్తుతం మొత్తం రూ. 8,472.39 కోట్ల లావాదేవీలతో బ్యాంక్ నడుస్తోంది. బ్యాంకు సాధించిన నికర లాభాల పంపిణీపై ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సింహభాగంగా 61 శాతం మేర డివిడెండ్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగుల బోనస్, చట్టబద్ధమైన కేటాయింపులకు వినియోగిస్తామన్నారు. ఈ ఏడాది మరో తొమ్మిది కొత్త బ్రాంచ్‌లను విస్తరించడానికి సిద్ధమవుతోందన్నారు. డైరెక్టర్లు ఎస్. నాగభూషణం చౌదరి, ఏ.జే. స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుల్లపల్లి జనార్ధన రావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కందపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, సీఈవో వరలక్ష్మి , డిప్యూటీ సీఈవో గణేష్ కుమార్, జీఎం ప్రసాద్ పాల్గొన్నారు.


