గోపాలపట్నం: నేవల్ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక మాజీ సైనికోద్యోగి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర లోహరా గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మోర్ పరాగ్ సురేష్ రావ్ (43), మాజీ సైనికుల కోటాలో వెపన్ ఎక్యూప్‌మెంట్ డిపోలో ఉద్యోగం పొంది, నాలుగు నెలల క్రితమే విధుల్లో చేరా డు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి డిఫెన్స్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నౌశక్తినగర్ పోస్టు నంబర్–1లో విధులకు హాజరైన సురేష్ రావ్, అర్ధరాత్రి 2.30 నుంచి 3 గంటల మధ్య టవర్–4 వద్ద తన వద్ద ఉన్న తుపాకీతో దవుడ కింద కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరనారాయణ ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్‌లో...‘నా మృతికి ఎవరూ కారణం కాదు. నాకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు నా పిల్లలకు చెందేలా చూడాలి’అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య మయూరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


