ఆధ్యాత్మిక..ప్రశాంత విశాఖ బీచ్‌లో బీర్లు అమ్ముతారా?
ఖబడ్దార్..అధికారంలోకి వచ్చిన వెంటనే జీవోను బంగాళాఖాతంలో కలిపేస్తాం
వైఎస్సార్‌సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి ఆధ్వర్యంలో వినూత్న నిరసన
డాబాగార్డెన్స్: ‘ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతతను అందించే బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు పదార్థాల కేంద్రంగా మార్చుతారా? ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి అంటే? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ మండిపడ్డారు. ‘బీచ్ షాక్స్’ పేరిట విశాఖ తీరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఆర్కే బీచ్ కాళీమాతా ఆలయం ఎదురుగా ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. పసుపు చొక్కాలు వేసుకున్న కొందరు.. బీచ్ రోడ్డులో బీర్లు, వైన్లు, చికెన్ దుకాణాలు పెట్టి విక్రయిస్తున్నట్లుగా స్కిట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని చేసిన నినాదాలతో బీచ్ రోడ్డు హోరెత్తింది.
మత్స్యకారుల ప్రాణాలతో చెలగాటమా?
అనంతరం వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు వినాయక నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, శివరాత్రి వేళ కోటి శివలింగాల పూజలు అందుకునే పవిత్రమైన విశాఖ తీరంలో వైన్ దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా అని చంద్రబాబు, లోకేష్, ఎంపీ భరత్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, పాఠశాలల సమీపంలో నిబంధనలు పాటించకుండా రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నా సరిపోలేదా అని ప్రశ్నించారు. మా మత్స్యకారులు నివసించే ప్రాంతాలే మీకు కావాలా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బీచ్‌లో మద్యం సేవించి సముద్రంలో ఈతకు వెళ్లి ఎవరైనా చనిపోతే దానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. తాగి పడేసే మద్యం సీసాల వల్ల చెప్పులు లేకుండా తిరిగే మత్స్యకారులు గాయాలపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దు..
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మద్యం దుకాణాలు పెట్టడమే ఏకై క మార్గమా అని వాసుపల్లి విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ‘బీచ్ షాక్స్’ జీవోను బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. గతంలో 2014లో కూడా విశాఖను గోవా, థాయిలాండ్ తరహా సంస్కృతిగా మారుస్తామంటూ చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇక్కడి ప్రజలు, మహిళా సంఘాలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సనాతన ధర్మమంటూ ఆలయాల మెట్లు శుభ్రం చేసి పవన్‌కల్యాణ్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు విశాఖ వంటి పవిత్ర తీరంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న చంద్రబాబు, లోకేష్, భరత్‌లతో కలిసి పవన్ కల్యాణ్ కూడా సముద్రంలో మూడు సార్లు మునిగి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


