విశాఖ స్పోర్ట్స్ : విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అండర్–16 మల్టీ డే క్రికెట్ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా విజయనగరం అండర్–16 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశాఖపట్నం జట్టు ఇన్నింగ్స్, 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష గణేష్ (125 నాటౌట్) అద్భుతమైన శతకంతో జట్టుకు భారీ స్కోరును అందించగా, మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. విశాఖ బౌలర్ల ధాటికి విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. దీంతో విశాఖపట్నం జట్టు ప్రత్యర్థికి ’ఫాలోఆన్’ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పుంజుకోలేకపోయిన విజయనగరం జట్టు కేవలం 71 పరుగులకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ విజయంలో విశాఖ బౌలర్ జాజుల యతీష్ చంద్ర అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో వెన్నుదన్నుగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టడంతోపాటు బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు చేసిన యతీష్ చంద్రకు ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.


