డాబాగార్డెన్స్: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో డీపట్టా, ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు, నేషనల్ దళిత్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్కు తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన సూరెడ్డి త్రిలోక్ 2009లో హైదరాబాద్ నుంచి భోగాపురం ప్రాంతానికి వచ్చి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరంలో పెద్దఎత్తున భూములు సేకరించినట్టు తెలిపారు. డీపట్టా భూములు భవిష్యత్‌లో ప్రైవేట్ భూములుగా మారే అవకాశాన్ని ముందుగానే గుర్తించి రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించి వందల ఎకరాల భూములపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు పొందినట్టు, ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో జారీ చేసిన ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల హస్తం ఉందని ఆరోపించారు.
నేషనల్ క్రిస్టియన్ బోర్డు
జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్కు


