మహారాణిపేట: ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదిత బే సిటీ అభివృద్ధి పనులను, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని దాదాపు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బే సిటీ అభివృద్ధి, బే సిటీ అథారిటీ ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, గ్రీన్ కారిడార్లు, పర్యాటకాభివృద్ధిపై సోమవారం కలెక్టరేట్‌లో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని సరిహద్దుల నిర్ధారణను వేగవంతం చేయాలని, పర్యావరణ ప్రాంతాలైన ఇందిరా గాంధీ జూ పార్క్, కంబాలకొండల్లో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.


