మధురవాడ: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవళ్లినగర్‌లోని హజరత్ ముఖ్తియార్ ఆలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అపోలో హాస్పిటల్, రెడ్‌క్రాస్ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరాలను రెడ్‌క్రాస్ చైర్మన్ బాల సతీష్, ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ఫకృద్దీన్ అహమ్మద్, డాక్టర్ ఫాజల్ రెహమాన్‌లు ప్రారంభించారు. ఈ శిబిరంలో మధురవాడ పరిసర ప్రాంతాలకు చెందిన 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు ఇన్సూరెన్స్‌తో పాటు డయాగ్నోస్టిక్ సేవలపై 70 శాతం రాయితీ కల్పిస్తామని ఈ సందర్భంగా బాల సతీష్ తెలిపారు. అపోలో హాస్పిటల్ వైద్య బృందం సుమారు 200 మందికి జనరల్, గైనకాలజీ, కార్డియాలజీ, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల్లో ఉచిత పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో–ఆర్డినేటర్ ఖాదర్, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


