ఒకే రోజు.. ఇద్దరు విద్యార్థుల విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు.. ఇద్దరు విద్యార్థుల విషాదాంతం

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

● సరదాగా వెళ్లిన ఒకరు.. పరామర్శకు బయల్దేరిన మరొకరు మృతి ● ఈ ప్రమాదాలతో రెండు కుటుంబాల్లో తీరని శోకం

ఆనందపురం/ పెదగంట్యాడ : ఉన్నత చదువులు పూర్తి చేసి కుటుంబాలకు అండగా నిలవాలని కలలు కంటున్న ఇద్దరు యువ విద్యార్థులు ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకరు స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరానికి వెళ్లి మృత్యువాత పడగా, మరొకరు తన క్లాస్‌మేట్‌ మృతికి సంతాపం తెలియజేయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు ఘటనలు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.

క్లాస్‌మేట్‌ను పరామర్శించేందుకు వెళ్లి...

ఆనందపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భీమిలి క్రాస్‌రోడ్డు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థి పతివాడ శశాంక్‌ (17) దుర్మరణం చెందాడు. ఆరిలోవకు చెందిన శశాంక్‌ తన క్లాస్‌మేట్‌ ఇటీవల మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయనగరం వెళ్తానని ఇంట్లో చెప్పి ఆదివారం ఉదయం బయల్దేరాడు.తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భీమిలి క్రాస్‌రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన శశాంక్‌పై నుంచి లారీ దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న యువతి డివైడర్‌పై పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి శ్రీనుకు శశాంక్‌ పెద్ద కుమారుడు. చదువులో చురుకై న తన కుమారుడు ఇక లేడన్న వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సముద్ర కెరటాలకు బలైన బీటెక్‌ విద్యార్థి

మరోవైపు యారాడ సముద్ర తీరంలో బీటెక్‌ విద్యార్థి అభిషేక్‌ పాల్‌ (20) మృతి చెందాడు. జార్ఖండ్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ పాల్‌ గంగవరం పోర్టులో ఉద్యోగం చేస్తూ భానోజీతోటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు అభిషేక్‌ బీటెక్‌ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం పదిమంది స్నేహితులతో కలిసి యారాడ బీచ్‌కు వెళ్లిన అభిషేక్‌ సముద్రంలోకి దిగకుండా ఒడ్డునే ఉండి కాళ్లు కడుక్కుంటుండగా ఒక్కసారిగా భారీ కెరటం అతడిని సముద్రంలోకి లాక్కెళ్లింది. స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతడిని రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని డ్రోన్‌ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు రాజుగారితోట సమీపంలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

కలలన్నీ కళ్లముందే

కరిగిపోయాయి

ఒకరు స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ, మరొకరు స్నేహితులతో సరదాగా గడపడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం విషాదకరం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆదివారం ఉదయం ఇంటి నుంచి నవ్వుతూ బయటకు వెళ్లిన కుమారులు సాయంత్రానికి మృతదేహాలుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని కలలు కన్న ఇద్దరు విద్యార్థుల జీవితం అర్ధాంతరంగా ముగియడంతో వారి స్నేహితులు, ఉపాధ్యాయులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే రోజు జరిగిన ఈ రెండు విషాద ఘటనలు యువతలో రోడ్డు భద్రత, సముద్ర తీరాల్లో అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement